Pages

Saturday, January 27, 2018

భావానంద భావ నక్షత్రమాల-bhAvAnanda bhAva nakShatramAla

భావానంద                                     శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యాం నమః                               రాధాకృష్ణ

భావానంద భావ నక్షత్రమాల


తే. గీ. శ్రీయుతాకార శ్రీకర శ్రీరమేశ
లలిత శ్రీవత్సశోభిత లక్షణుండ
తులసిమాలావిరాజిత కలితవదన
మానవేశ్వర! యతిరాజ! మహితతేజ

కం. క్షీరాబ్ధి శేషశయనుడు
నారాయణబాబయనెడు నామము కలుగన్
కోరిన వరములనొసగన్
ధారుణిపైయవతరించె తనభక్తులకై

కం.  వరగల్లు శంభుదేవుని
వరమేయీవిష్ణుతేజమంతటవెలిగెన్
మరుకూకుగ్రామజనులకు
మరువనిగురువయ్యెనపుడు మహితాత్ముండై

తే.గీ. అమ్మనాన్నల దీవనలందుకొనిన
శ్యామసుందరుడొకనాడు చదువదలచి
మాముదాలకు చేరెను మహితగతిని
రామచంద్రుని దర్శించె కోమలముగ

తే.గీ. శ్యామవటువుకు గురువాయెరామవిభుడు
విద్యలెన్నియో నేర్పెను విప్రవరుడు
చదువుపూర్తిచేసుకొనిన శాంతమూర్తి
గురువు సంజ్ఞకు తలయూపె సురులుమెచ్చ

ఆ.వె.  రామచంద్రమూర్తి రతనాలబిడ్డను
పెండ్లిచేసుకొనిన ప్రేమమూర్తి
సమయమొచ్చినంత జనపదమునువీడి
అడవిలోకి వెడలె వడిగవడిగ

తే.గీ.  పర్ణశాలలు వెలసెను పలువిధమ్ము
జనులసందడిపెరిగెను క్షణముక్షణము
పాండురంగడువెలసిన దండివనము
దివ్యశోభతో వెలుగొందె దిశలునిండ

తే.గీ.  లక్ష్మి శ్రీయశోద   పరమలాలనలతో
సేవలొనరించె జనులకు శ్రీలు కురియ
అన్నపూర్ణయై తానుండవంటగదిలొ
అమృతమగుచుండె వంటలు యద్భుతముగ

తే.గీ. శ్రీమహాలక్ష్మి కూతురు చినబిడ్డ
విశ్వనాథుడు తనయుడు వెండికొండ
అమ్మనాన్నల మురిపాల ఫలము లివియె
జనులమధ్యలో పెరిగిన జ్ఞానధనులు

తే.గీ. విశ్వనాథునిమేనత్త విమలచరిత
పాండురంగడు మెచ్చిన భక్తురాలు
సచ్చిదానంద రూపిణి సరళహృదయ
జనులుమెచ్చిన “నరసక్క” జ్ఞానరాశి

తే.గీ. ఎందరెందరో సేవలు చేయదలచి
పాండురంగనికొలువులో భక్తులయ్యి
ఈశ్వరన్నకుతోడుగా ఎదిగియెదిగి
భావనానందునికృపకు పాత్రులైరి

తే.గీ. అమృతకుండము ఆశ్రమ చంద్రభాగ
అమృతవర్షముకురుయునుయనవరతము
ఎంతజలమునుతీసినయంతెయుండు
గురువుకృపకదిచిహ్నము మరుపురాని

కం. హరిగంగ తీర్థరాజము
సరిలేదిటువంటికొలనుజనపదములలో
గురుకృపయేమో? తెలియదు
విరివిగజలముండుయిచట సిరివెన్నలతో

ఆ.వె. గంగగోవులెన్నొకానని రూపాన
సంచరించుచుండు ఆశ్రమమున
పంచెకట్టుకొనిన బాలకృష్ణునిఁజూడ
సురులువత్తురిటకు మెరుపువోలె

కం. యతివరభావానందుడు
శృతిసారము తెలిసినట్టి సుందరిడితడే
కృతులనువ్రాసినఘనుడీ
కతలేల చదువుమనకిట కనపడుచుంన్

తే.గీ. అన్నమోరామచంద్రాయటంచలరెడి
జనులయార్తనాదమువిన కనులుచెదిరె
పరమహంసభావానంద ప్రభువుకపుడు
అశ్రుధారలు వెలువడె కనులనుండి

తే.గీ. తెలిసిపోయెను కర్తవ్యమేమొ తనకు
పయనమాయెను ఆశ్రమ పరిధి దాటి
పల్లెగ్రామాల జనులెల్ల పరవశించి
ఊరువెలుపుల నిలబడి ఉత్సుకతతొ
* స్వాగతించిరి గురువును సకలవిధము

తే.గీ. గజ్జలందెలు కాళ్ళకు కట్టుకొనిన
భక్తులెందరో హరినామ భజనతోటి
చిందులేసిరి జనములో సిరిలు మరచి
గ్రామజనులలో చైతన్యమంకురించె

కం. భగవానుడె మనదైవము
భగవన్నామము సులభము పలుకుటకెపుడున్
భగన్నామము ఒకటే
భగవానునికడకుచేర్చు పామరునైనన్

కం. ఎక్కడ చూచిన భజనలె
చక్కగ కొనసాగుచుండె శ్రమలేకుండన్
చెక్కెరపొంగలి సాదము
మక్కువతోయారగించ మర్మముతెలిసెన్

తే.గీ. హలముపట్టెడు రైతుల కలలునేడు
పంటపండెను హరినామ భజనవలన
అందరొకటన్న భావన కలిగెనేమొ?
వెలసె సత్సంగభవనాలు వెలుగుఁజూప

తే.గీ. మంచిగుణములు పెరిగెను మమతతోటి
చదువుసంధ్యలు యబ్బెనుజనులకంత
పల్లెపల్లెల్లొ సద్భావమంకురించ
కపటమెరుగనిజనులకు కలిగెమేలు

కం. గురువే తల్లియుఁదండ్రియు
గురువేమనతోడునీడగురువేదైవం
గురువేసత్యము జగతికి
గురుజ్ఞానముఁబడయవలయు గురుతర బుద్ధిన్

కం. భావానందునిరూపము
భావనచేయగ దరశన భాగ్యముకలుగున్
భావానందుడె సర్వము
భావముతోచిత్తశక్తిబలమగు జీవా!

తే.గీ. అలసటన్నదియుండదు ఆశ్రమమున
ఉత్సుకతహెచ్చు పనిచేయ ఓర్పుకలిగి
మనసుకానందమగుచుండు మనిషికెపుడు

ప్రణవశక్తన యిదియేమొ! పాండురంగ


తే.గీ. పాండురంగడు గురుదేవులాశ్రమమున
స్వప్రకాశులై యున్నారు శాశ్వతముగ
నామ కీర్తనారాధన, నామ-జపము
చేయుపద్ధతి నెలకొల్పె శ్రీగురుండు

తే.గీ. నామసంపద నొసగిన స్వామియిచట
అణువణువునందు జ్యోతియై యలరుచుండె
భవ్యమగు నామసాధన ఫలము వలన
త్రివిధ తాపములు శమియించు రీతిగనుము


త్రిగుళ్ళ రామమూర్తి, విశ్రాంత తెలుగు పండితులు, తీగుల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ.


***

3 comments:

  1. పెద్ద బావగారికి బహు వందనములు. బహుపరాక్.మీ భావానందమాల" రచన ఈరోజే పూర్తిగా ఇప్పండే చదివాను.అచ్చమైన భావానందమును ప్రసాదించే మీ పద్యరచనకు కోటి కోటి జోహార్లు. మీ వేంకన్న.

    ReplyDelete
  2. ఇందులో. 27పద్యాలు న్నాయి.దీనికి శీర్షిక గా "భావానంద భావ నక్షత్ర మాల" లేదా "భావానంద భావ తారావళి "" అని పెడితే ఎట్లుంటుంది ?బావగారూ నమస్కారం.మీ అభిప్రాయం సెలవీయగలరు.మీ వేంకన్న.

    ReplyDelete