Pages

Monday, August 29, 2011

molla rAmAyaNam-ayOdhyakANDa

శ్రీ
రామాయణము
అయోధ్యాకాండము

క. కందర్ప రూప! ఖండిత
కందర్ప విరోధి చాప! కరుణా ద్వీపా !
వందిత శుభ నామా ! ముని
సందోహ స్తుత్య భూమ ! జానకి రామా ! ||1||

వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహాముని కెఱింగించిన తెఱంగు వినిపించెద నాకర్ణింపుము:

శ్రీరామునకుఁ బట్టాభిషేక సన్నాహము

సీ. తన సుమంత్రాది ప్రధానులతోఁ గూడి
సుఖ గోష్ఠి నుండంగ నఖిల జనులఁ
జక్కగా రావించి, సమ్మదంబున వంశ
గురువుతో దశరథ ధరనినాధుఁ
డనియె: నీ భూ భార మంతయు నొక్కట
నేలితినిఁ జాలదే యేక హేళి ?
నటుగాక పరగతుల నవలీల గెల్చితి,
నిల్పితి ధర్మము నిష్ఠతోడ

తే. నింత చాలదె? యాశకు నెంత కెంత?
రామచంద్రుని ధరణికి రాజు గాఁగ
మీరు సూడంగఁ బట్టంబు భూరి మహిమఁ
గట్టవలయును మంచి లగ్నమునఁ జెలఁగి ||3||

తే. అనుచు గురునకుఁ దెల్పి, తా నతని సమ్మ
తమున సౌభాగ్య మంగళ ద్రవ్య సమితిఁ
గూర్చుఁ డనుచును మంత్రులకును నెఱుంగఁ
జెప్పి, శృంగార మీ పురిఁ జేయుఁ డనియె. ||4||

వ. అట్టి సమయంబున. ||5||

సూర్యాస్తమయ వర్ణనము

తే. పగలు ప్రాగ్భాగమున నుండి గగన వీథిఁ
జరమ దిక్కున కేఁగఁగా శ్రమము దోఁచి
చెమట పట్టిన స్నానంబుఁ జేయు నరుగు
కరణి, నప రాబ్ధిలో దివాకరుఁదు గ్రుంకె ||6||

క. మేలిమి సంధ్యా రాగము
వ్రాలిన చీఁకటియుఁ గలిసి వరుణుని వంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టె నట నభో మణి తలఁగన్. ||7||

వారక కల్ప ద్రుమమునఁ
గోరకములు పుట్టినట్లు గురుతర కాంతిన్
దారకములు తలసూపెన్
జోరానీకమ్ము మిగుల స్రుక్కుచు నుండన్ ||8||

ఆ. కారు మొగులు రీతిఁ, గాటుక చందాన,
నీతి భాతి, నింద్ర నీల మహిమ,
మాష రాశి పోల్కి, మఱి మఱి యపు డంధ
కార మవని యెల్లఁ గలయుఁ బర్వె ||9||

వ. అట్టి సమయంబున ||10||

చ. తలవరులన్, నిజాధిపుల, దప్రకు నేర్పునఁ గన్నుఁ బ్రామి, య
త్తలఁ, దమ పిన్నపాపల, నుదారత నేర్పడ నిద్రపుచ్చి, ని
ర్మల కర కంకణావళులు, మట్టెలు రట్టుగ మ్రోగనీక, వి
చ్చలవిడిగాఁ జరించి రొగి జార లతాంగులు మధ్య రాత్రులన్. ||11||

చ. సురతము లేక యుస్సురను జోటి, మగం దుడికించు కాంతయున్,
సరస మెఱుంగు చంద్ర ముఖి, సావడి దంటయు, బేరకత్తెయున్,
బర పురుశాభిలాషమును బాయని భామిని పోరుకట్టునన్
బరఁగిన భామ లాది యుపభర్తలఁ చరించి రత్తఱిన్. ||12||

చంద్రోదయ వర్ణణము

ఉ. భాను సహస్ర సత్కిరణ పంక్తుల నుద్భవమైన యీ బృహ
ద్భానుని వెట్టఁ బెల్లుడుకఁ బడ్డ సుధాంబుధి మీఁది మీగడల్
పూని సమీరుచేఁ దెరలఁబూర్వ దిశం గనుపట్ట దానిపై
ఫేన మనంగ నొప్పె శశి బింబము తూరుపుఁ గొండపైఁ దగన్. ||13||

చ. కుముదములుం, జకోరములుఁ, గోమల సస్యముఁ జంద్రకాంతముల్
రమణఁ జెలంగ వెన్నెల తిరంబుగఁ జేసె జగంబు లుబ్బఁగాఁ
గమలములున్, వియోగు, లధికంబుగఁ జోరులుఁ, జక్రవాకముల్
రమణ గలంగ వెన్నెల తిరంబుగఁ గాచె జగంబు లుబ్బఁగాన్ ||14||

ఉ. నారదులైర్ సన్మునులు, నాక మహీజము లయ్యె భూజముల్,
శారదలైరి భామినులు, శంకర శైలము లయ్యె గోత్రముల్,
పారద మయ్యె నీరధులు, పన్నగ నాయకులైరి, నాగముల్,
వారిద వర్గ మెల్ల సిత వర్ణము లయ్యెను బండు వెన్నెలన్ ||15||

చ. కొడు కుదయించె నం చలరి కోరి సుధాంబుధి మిన్ను ముట్టి, య
ప్పుడు జగమెల్లఁ గప్పె ననఁ బూర్ణత నొందెను సాంద్ర చంద్రికల్
పుడమికిఁ బాలవెల్లి గతి బొల్పెసలారఁగఁ జంద్రుఁ డొప్పె, న
య్యుడుపతి మేని మచ్చయును నొప్పెఁబయోనిధి పద్మనాభుడై ||16||

వ. అట్టి సమయంబున ||17||

ఉ. కోరి చకోర దంపతులు గుంపులు గుంపులు గూడి, రంతులన్
బేరిన చంద్రికా రసముఁ బేర్కొని మార్కొని పొట్ట నిండగాఁ
బారణ సేసి, పెన్ బయలఁ బ్రాఁకుచు, జంచు పుటంబు లెత్తుచున్
బేరెము వారుచుండె మదిఁ బ్రేమ జనింప వధూటి కోటికిన్ ||18||

ఉ. వెన్నెల తీఁగలన్ గొనలు వేడుక ముక్కలఁ ద్రుంచి తెచ్చి, తా
ర్కొన్న ప్రియాంగనా తతికిఁ గూరిమి నోరికి నిచ్చి, కేళికిన్
సన్నపుఁ గంఠ నాళముల సన్నలు సేసి సుఖించె నింపుగన్
ద్న్నని చంద్రకాంత మణి తిన్నెలమీఁదం జకోర దంపతుల్ ||19||

ప్రభాత వర్ణణము

తే. పాకశాసని చేమంతి బంతి దివికి
నెగుర వేచిన కైవడి నేమి చెప్పఁ
బాండు వర్ణంబుతో బూర్వ భాగ సీమ
సొంపు మీఱగ వేగురుఁజుక్క వొడిచె. ||20||

వ. అట్టి సమయంబున ||21||

క. రవి చనుచెంచెను జనుడీ
దివియలు, నక్షత్ర సమితి, తిమిరము, శశియున్
బవ లేమిటి ? కనురీతిని
గువలయమున గూళ్ళుఁ గోళ్ళు గూయఁగ సాఁగెన్ ||22||

చ. వదలక పద్మరాగ మణి వజ్రపుఁ దర్మెనఁ బట్టి నేర్పు పెం
పొదవఁగఁ దూర్పు కొండపయి కొప్పుగఁ దెచ్చి జగద్గురుండు దాఁ
ద్రిదశవరేణ్యు దట్టేదురఁ చేఁకువ నిల్పిన దర్పణంబు నా
నుదయము నొందె భానుండు సముజ్జ్వల కోకనద ప్రదీప్తులన్ ||23||

రాముని గానలకుఁ బంపుటకై కైక పన్నాగము
ఆ. వసుమతీశ ! నాకు వరమిచ్చి తప్పుట
తగవు గాదు మీకుఁ, దలపులోన
మఱచినా రదేమొ,మన్నించి తొల్లింటి
యీవు లీయవలయు నీ క్షణంబ ||25||

క. జననాథ ! నా కుమారుని
వినుఁడీ పట్టంబు గట్టి వేవేగను,
రా మునిగా ననుపుఁడు మఱి
వనమునఁ బదునాలుగేండ్లు వర్తింపంగన్ ||26||

వ. అని ప్రార్థించిన విని పార్థివేంద్రుఁడు డిల్లపడి తల్లడిల్లుచు నుల్లంబు గలంగి ముసుంగిడి యచ్చేడియ పలికిన పలుకులకు మాఱాడ నోడి మిన్నక యున్న యున్న సమయంబున, సుమంత్రుం డేతెంచి "స్వామీ ! రామచంద్రుని బట్టంబు గట్ట సుమూహుర్తం బాసన్నం బయ్యెఁగావున మిమ్ము నచ్చటికి విచ్చేయ నవధరింపుఁ" డని వశిష్ఠ భగవానుండు విన్నవించు మని పంపె నని చెప్పిన కైక యిట్లనియె : ||27|

మ. అనిలో మున్ను నృపాలు చిత్తము కేనహ్లాదముం గూర్చి, నా
తనయుం బట్టము గట్టి, రాఘవుని బద్నాలుగేండ్లు కాంతారమం
దును వర్తిల్లఁగఁబంపఁగొన్న వరమున్ ద్రోయంగరా దెంతయున్
వనసీమన్ ముని వృత్తి నుండు మనుఁడీ వైళంబ యా రామునిన్ ||28||

క. అని పలుకు కైక పలుకులు
విని వేగము మరల వచ్చి విన్నఁదనంబున్
దనుక వశిష్ఠునితోడన్
వినుపించె సుమంత్రుఁ డట్టి విధ మేప్రడఁగన్. ||29||

సీతా లక్ష్మణులతొ శ్రీరాముని యటవీ నిర్గమనము

వ. అనిన విని వశిష్ఠాది ప్రముఖులును, సుమంత్రాది ప్రధాన జనంబులును, సైన్యంబులును, బరివారంబులును విన్ననై యున్న నా సన్న యెఱింగి, రామచంద్రుండు రాజ చిహ్నంబులు త్యజించి, జటా విభూతి వల్కలంబులు దాల్చి, ధనుర్ధరుండై యున్నంత; లక్ష్మణుండును భూ పుత్రికయును దోడం జనుదేరఁ, దల్లులకు నమస్కరించి, వశిష్ఠానుమతంబున నాశీర్వచనంబులు గైకొని, యాస్థానంబు వెలువడి యరణ్యంబున కరుగునప్పుడు పుర జనులందఱును బురపురం బొక్కుచు, దశరథ మహారజును దూషించుచుఁ, గైకను నిందించుచు, మూఁకలై శోకించుచుండ్; నది యంతయు విని దశరథుండును మరీలి వచ్చి పుత్ర శొకంబున నాక పురంబునకుం జనియెఁద దనంతరంబ, ||30||

గుహుని ప్రపత్తి

ఆ. చనుచు రాఘవుండు స్వర్ణది యొడ్డున
గుహుని గాంచి యతనిఁ గుస్తరించి
తడయ కోడఁ బెట్టి దాఁటింపు మనవుడు
నట్ల చేయఁ దలఁచి యాత్మలోన ||31||

క. "సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణువి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో" యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజ యుగమ్ము భయమ్ము పెంపునన్. ||33||

భరద్వాజ మునియాదరాతిథ్యము

ఉ. రాజ కులావతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను నా భర నా భర
ద్వాజ మహా మునీంద్రు పద వారిజముల్ గని మ్రొక్క నాతఁడం
భోజ హితాన్వ యాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన రామునిం
బూజ లొనర్చి కంద ఫల మూలములం బరితృప్తుఁ జేసినన్ ||34||

వ. సంతసించుచు నా రాత్రి యచ్చట నివసించి మఱునటి దిన మర్కోదయమ్మున ||35||

వ. మదముతోడఁ దన్ను ముని భరద్వాజుండు
భక్తి ననుప, రామభద్రుఁ డంతఁ
జనియె భాతృ దార సహితుఁడై నన్ముని
కూటమునకుఁ జిత్రకూటమునకును. ||36||

భరతుని భాతృ భక్తి

మ. ఘనుఁడా రాముఁడు చిత్రకూటమున వేడ్కంజేరి యున్నంతలో
నన, దంతావల వాజిరత్న రథ నానా యోధ సంఘంబుతో
డ, నమాత్య ద్విజ బంధు వర్గముతోడం గూడి వాద్యంబులం
జనుదెంచెన్ భరతుండు రాముకడకున్ సద్భక్తి సంపన్నుఁడై ||37||

సీ. చనుదెంచి, రాముని చరణంబులకు మ్రొక్కి,
కైకేయి చేసిన కపటమునకు
నగరంబు విడిచి, యీ పగిది ఘోరారణ్య
మన కిట్లు రానేల మునుల పగిది ?
నది గాక, మన తండ్రి యత్యంత మైనట్టి
పుత్ర శోకంబునఁ బొక్కి పొక్కి
త్రిద శాలయమ్మున దేవేంద్రుఁ గనఁబోయె,
నని చెప్ప విని రాముఁ డంతలోన

తే. భరత లక్ష్మణ శత్రుఘ్న ధరణి సుతలఁ
గూడి దు_ఖించి దు_ఖించి, కొంత వడికి
నాప్త వర్గంబుచే మానె, నంతమీఁద
భరతుఁ డిట్లనె శ్రీరామభద్రుతోడ; ||38||

తే. "రాజు లేకున్నచో మఱి రాష్ట్ర మందుఁ
గార్య మెట్లౌను ? మీ రెఱుంగనిది కలదె ?
నేఁటి సమయానఁ బట్టంబు నిలుపుకొనఁగఁ
దిరిగి విచ్చేయుఁ" డనుడు నా భరతుతోడ. ||39||

వ. శ్రీ రామచంద్రుం డిట్లనియె; ||40||

శ్రీ పాదుకా ప్రదానము

చ. జనకుఁడు సేసినట్టి మితిఁ జక్కఁగఁ దీర్చి, కదండ నేను వ
చ్చిన గుఱిదాఁక, భూతలముఁ జేకొని రాజ్యముఁ జేయు, మాట గా
దనకు మటన్న, నొల్లనన, నాతనికిం దన పాదుకా యుగం
బొనరంగ నిచ్చి పొమ్మనుచు నుర్వికి రాజుగఁ బంచె సొంపుగన్ ||41||

విరాధ వధ

వ. ఇట్లు భరతుని భరతాగ్రజుం డనునయించి మరలించి, నాకలోక కవాటంబగు చిత్రకూటంబు కదలి సౌమిత్రి భూపుత్రులం గూడి పోవు నెడ, నటవీ మధ్యం బున విరాధుం డనుదైత్యాధముం డప రాధంబు చేసి, దిగ్గిన డగ్గఱి జగతీ గనూభవ నెత్తుకొని గగన మార్గంబున కెగిరిపోవునెడ వాఁడి బాణంబున వాని కంఠంబును ద్రుంచి, గారుడాస్త్రంబున మరల నొయ్యన జనక నందనం డించి, భయంబు వాపి, ప్రియంబు సూపి, యొయ్యె నొయ్యన నయ్యెడ నున్న యత్రి మహా ముని యాశ్రమంబునకుం జని, ఘనంబున నా ఘనుండు సేయ పూజలం గైకొని, రామచంద్రుండచ్చటి మునీంద్రులకు దైత్యులవలని భయంబు లేకుండ నభయం బిచ్చి, మున్ననం గొన్ని దినంబు లాయా మునుల యాశ్రమంబుల నిలుచుచు, వార లనుప శరభాది మృగోత్కర శరణ్యం బగు నరణ్యంబు జొచ్చి పోయెననై చెప్పిన విని నారదుని వాల్మీకి మునీంద్రుం డటిమీఁది కథా విధానం బెట్టిదని యడుగుటయు ||42||

ఆశ్వాసాంత పద్య గద్యములు

క. జలజాక్ష ! భక్త వత్సల !
జలజాసన వినుత పాద జలజాత ! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస ! జానకి నాథా ! ||43||

గద్యము

ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగ మార్చన వినోద సూరిజన వినుత కథా కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయన మహా కావ్యంబునం దయోధ్యాకాండము సర్వము నేకాశ్వాసము.

No comments:

Post a Comment